Pages

Tuesday, June 25, 2013

బహుముఖ ప్రజ్ఞాశాలి డేగల చందర్ రావు..!



భద్రాచలం లో పరిచయం అవసరం లేని వ్యక్తి ఎవరని అడిగితే అది విజయ్ టైలర్స్ అధినేత డేగల చందర్ రావు అని ఎవరైనా చెబుతారు.ఎనిమిదేళ్ళ కుర్రాడి దగ్గరనుంచి ఎనభైయేళ్ళ ముదుసలిదాకా అందరకీ తలలో నాలుకలా వుంటూ అందరివాడుగా భావించబడే మనిషి మన చందర్ రావు.కేవలం అతన్ని ఒక టైలర్ అనుకుంటే పొరపాటు పడినట్టే..!




అతనికి రాని అంశమంటూ వున్నదా అనిపిస్తుంది చందర్ రావు చాకచక్యం చూస్తుంటే..!ఆయన ఒక నటుడు,ఒక ఇంద్రజాలికుడు,ఒక స్వచ్చంద సేవకుడు ఇలా ఎన్నో కోణాలు చందర్ రావు లో వున్నాయి.ఏప్రిల్ 10, 1959 సం.లో జన్మించిన ఆయన పెద్ద వారిలో పెద్దవాడు..చిన్నపిల్లల్లో చిన్నవాడు. ఎప్పుడూ పరవళ్ళు తొక్కే వుత్సాహంతో అందరిని పలకరించే ఆయన జీవిత పుటల్లోకి ఒక్కసారి తొంగిచూద్దాము.





ప్రాధమిక స్థాయితోనే విద్యాభ్యాసాన్ని చాలించిన మన చందర్ రావు లోకం అనే విశ్వవిద్యాలయం లో పొందని డిగ్రీ అంటూ లేదు.కేవలం ఒక మిషన్ తో తన జీవన యాత్రని ప్రారంభించిన ఆయన పది మిషన్లని నిర్వహించే స్థాయికి ఎదిగాడు.అనేక మందికి వుపాది కల్పించాడు.సినీ కాస్ట్యూం డిజైనర్ గా పేరుపొందాడు. 


ఎన్నో తెలుగు సినిమాల్లో చిన్న కేరక్టర్ పాత్రల్ని పోషించాడు.అడవిలో అన్న,సూర్య పుత్రులు,దండోర,దేవుళ్ళు,స్వర్ణక్క,చీకటి సూర్యులు,జుమ్మంది నాదం,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,ఎంకౌంటర్,భద్రాద్రి రాముడు,గోదావరి పొంగింది,ఇలా అనేక చిత్రాల్లో నటించారు.





అంతేకాదు ఎన్నో నాటకాల్లో నటించి అవార్డులు ..రివార్డులు పొందారు.ఇదిలా వుండగా...కళ్ళకి గంతలు కట్టుకొని అనేక గంటల పాటు భద్రాద్రి వీధుల్లో స్కూటర్ని నడిపి రికార్డ్ సృష్టించారు.అనేకమంది వృద్దులకి..పేద విధ్యార్ధులకు తనకి తోచిన సహాయం చేస్తుంటాడు మన చందర్ రావు.శ్రీ రాజగోపాలాచార్యుల వారి వద్ద వేణు వాయిద్యాన్ని అభ్యసించి సంగీతంలోనూ తన సత్తా చాటుకున్నాడు.





ఈ టీవి-2 తో పాటు...ఈనాడు,ఆంధ్ర ప్రభ,వార్త,ఆంధ్ర భూమి,డెక్కన్ క్రానికల్ ఇలాంటి ఎన్నో మాధ్యమాల్లో చందర్ రావు ప్రతిభని శ్లాఘించడం జరిగింది.





ఈ విధంగా రాసుకుంటూ పోతే రాయవలసింది ఎంతో మిగిలి పోతూనే వుంటుంది ఆయన గురించి..!వృత్తి పరంగా..ప్రవృత్తి పరంగా ఎన్నో గెలుపు జెండాలని ఎగరేసుకుంటూ సాగిపోతున్న ఆయన జైత్రయాత్ర అప్రతిహతంగా అలాగే సాగి పోవాలని ఆశిద్దాం.

                                                     Mobile No. of  Chander Rao: 9533345140

No comments:

Post a Comment

Thanks for your visit and comment.