Showing posts with label Tours. Show all posts
Showing posts with label Tours. Show all posts

Saturday, October 29, 2016

రాయగడ (ఒరిస్సా) వెళ్ళిన అనుభవాలు

రాయగడ (ఒరిస్సా) వెళ్ళిన అనుభవాలు

ఈ నెల లోనే మొదటి వారం లో రాయగడ వెళ్ళాను.అదే ఒరిస్సా లోనే ఉన్న ఆ ఊరు.మిత్రులు కొంతమంది పిలుపు మేరకు అలా వెళ్ళడం జరిగింది.ఒక సాహితీ సమావేశం అన్నమాట.ఈ సారి ఏది ఏమైనా బస్సు మీదనే వెళ్ళాలనే  అనుకున్నాను.గతం లో భువనేశ్వర్ లో వెళ్ళినప్పుడు రైలు లో పోవడం జరిగింది.ఏదైనా గానివ్వండి ..ఒక జీవిత అనుభవం ,బస్సు మీద వెళ్ళేది అది వేరే ఉంటుంది. దాని కోసమె బస్సు ని ప్రిఫర్ చేశాను ఈసారి.కొంత నొప్పులూ అవీ ఉంటాయి ..బస్సులో వెళ్ళినప్పుడు..అయితే వాటిని తట్టుకోడానికి గాను కొన్ని వ్యాయామాలు అవీ చేస్తుంటాను కాబట్టి ఇబ్బంది లేదు...ఇబ్బందులు ఉన్నా అవి ప్రయాణ అనుభవాల ముందు బలాదూర్.ఏమో బాబు నేను అలా ఫిక్స్ అయిపోయ్యా అంతే...!



సరే...భద్రాచలం నుంచి జైపూర్ (ఒరిస్సా) కి ఎకాఎకి బస్సు ఉంది. దాన్ని రోజు చూస్తుంటా.మొత్తానికి ఈ రోజు దీనితో అవసరం పడిందా అనుకుంటూ తొమ్మిదవ తారీఖున ఎక్కాలని పొద్దునే వెళితే ఫుల్ రష్.ఏమి చేయాలో తోచలా.అయినా ఒక సారి ఫిక్స్ అయ్యాక వదిలితే ఎలా..మనది వేరే టైపుగా..వెంటనే తయారు గా ఉన్నా రాజమండ్రి బస్సు ఎక్కేశా...అక్కడ దిగగానే విశాఖ కి రెడీ గా ఉంది.అంతే ఎక్కేశా.అయితే ఒకటి రెండు సమోసాలు తిని ఎక్కడం జరిగింది.ఎందుకైనా మంచి ది లోపల ఉంటుంది గదాని.


విశాఖ లో దిగి బస్ స్టాండ్ లో ..మిని మీల్స్ అంటూ ఒకటి కనబడితే అది కానిచ్చాను.సమయం అయిదు దాటింది.ఆ కాంప్లెక్స్ లోనే ఒరిస్సా వాళ్ళ కౌంటర్ ఒకటి ఉంది..అక్కడికి వెళ్ళాను..వివరాలు కనుక్కుందామని....!ఒక ఇద్దరు ఒరియా వాళ్ళు కూర్చునే గుర్రు పెట్టి నిద్ర పోతున్నారు.ఒక ఒరియా కుర్రాణి ఇంగ్లీష్ లో ప్రష్నిస్తే ఇప్పుడు రైలు ఉంటుందిగా వెళ్ళండి అన్నాడు...! ఒరే బాబూ..నేను బస్సు లో మాత్రమే వెళ్ళాలి అది నా నిష్ట...అనుకుని అలా వచ్చి ఒక కండక్టర్ ని అడగగా ..ఇక్కడినుంచి ముందు పార్వతి పురం వెళ్ళిపొండి సార్..అక్కడనుంచి రాయగడ కి బోల్డన్ని బస్సులు అన్నాడు.

బతుకు జీవుడా అనుకుంటూ ..పార్వతీ పురం బస్సు ఎక్కాను.ఎందుకో గాని ఆ ఊరి పేరు అంటే భలే ఇష్టం నాకు ఎప్పటినుంచో...!సరే ఎక్కాను....రకరకాల అందమైన ఊళ్ళ గుండా సాగిపోతున్నది.ఎక్కేవాళ్ళు..ఎక్కుతున్నారు...దిగేవాళ్ళు దిగుతున్నారు. మధ్యలో అప్పుడప్పుడు అప్పల్నాయుడు,రావి శాస్త్రి  గారి రచనల్లో పాత్రలు మాట్లాడే యాసలో కొన్ని సంభాషణలు.ఆ బస్సు లోనే.

మొత్తానికి పార్వతి పురం కి వెళ్ళాను.బాగా రాత్రి అనిపించి విశ్రాంతి తీసుకోవాలనిపించింది. శరీరం కి కూడా అవసరం అది. ఒక పెసరట్టు తిని దగ్గర లోని లాడ్జ్ గురుంచి అడగ్గా చెప్పాడు ఒక అబ్బాయి.ఆ నివాసం దగ్గరకి వెళ్ళగా ఓ కుర్రాడు ఉన్నాడు.సార్ ముందు రూం చూడండి..మీకు నచ్చితేనే అన్నాడు తను.చూసి సరేలే అన్నాను.ఒక మాదిరిగా ఉంది.ప్రయాణాల్లో ఇవన్నీ పట్టించుకుంటే జరిగేది కాదు.పక్కనే మా ఓనర్  ఉంది వెళ్ళమన్నాడు. వెళితే అది ఓ కిరాణా దుకాణం...ఆమె ఎంతకూ తేల్చదు..ఒకటే ఇదిగా సెల్ ఫోన్ లో మాట్లాడుతోంది...ఎవరితోనో..!మనిషి మంచి దిట్టంగా ఉంది.చివరికి ఒక రూం కి అడ్వాన్స్ తీసుకుంది.
చక్కగా తలారా స్నానం చేయడం తో నిద్ర బాగా వచ్చింది.రాష్ట్రాలు దాటి  దాటి ప్రయాణాలు ఇది నాకు మొదటిది కాదు చివరిదీ కాదు కనుక ఇంకా ఏమీ యోచించకుండా నిద్రపోయాను.తెల్లారి లేచి బయటకి రాగానే  రాయగడ బస్సు ఎదురొచ్చింది.మరిదే దైవం కూడా సహకరించడం అంటే...!ఎక్కేశాను..అప్పుడు సమయం ...అయిదున్నర అయింది.కొద్ది దూరం పోగానే ఊరి పేరు కొమిరాడ అనుకుంటా...చాలామంది ఆడవాళ్ళు ..అరటి గెలలు తీసుకొని  బిల బిల మంటూ ఎక్కసాగారు.కాళ్ళు పెట్టుకుంటాంకి కూడా సందూ లేదు.ఇవన్నీ రాయాగడ కి తీసుకెళ్ళి అమ్మడానికట..ఒకామెని అడిగితే చెప్పింది.

అలా పోయి పోయి మొత్తానికి ఓ గంట పైన గడిచిన తర్వాత రాయగడ లో దిగాను.ఊరు జిల్లా కేంద్రం కనుక పెద్దదే..ఓ బ్రిడ్జ్ దగ్గరలో బస్సు ఆగాక స్టేషన్ రోడ్ లోని ఓ హోటల్ కి వెళ్ళాను... అది తెలుగు వారిదే.తర్వాత అర్ధమయింది.దాని పేరు ఆరాధన.ముందు నాలుగు వందలు చెప్పి తర్వాత ఒక వంద తగ్గించాడు  ..బేరమాడగా...అలా ఇస్తాడని అతని కళ్ళ లోనే తెలుస్తోంది..అది అనుభవం లో అలా తెలుస్తుంది అంతే.

రూము,సదుపాయాలు ఫర్వాలేదు ..హాయిగా ఉంది.ఒక సారి ఊళ్ళోకి అలా ఓ రౌండ్ వేసి వద్దామని వెళ్ళాను.కాసేపు రెస్ట్ తీసుకున్నాక...!మజ్ఝి గౌరి అని అమ్మ తల్లి  అక్కడ చాలా ప్రఖ్యాతి.ఆటోల మీద,జీపు ల మీద ఎక్కడ చూసినా ఆమె పేరే.అక్కడకి సంబందించి అనుకుంటా చాలా వీధుల్లో ఒక రకమైన రంగు రంగు దండలు ఆ ఊరి వీధుల్లో కానవస్తాయి.ఏ మూల విన్నా ఒరియా ,తెలుగు వినవస్తూనే ఉంటాయి. అది ఒక విన్నూత్న రంగ భూమి.అక్కడి చాలామంది తెలుగులు ప్రవాసాంధ్రులు కారు... తాత ముత్తాతలనుంచి అక్కడ ఉంటున్న వారే. కాకపోతే భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో అవి అటు అలా కలిసిపోయాయి అంతే.అక్కడ రాజకీయ ఆధిపత్యం సైతం తెలుగు వారిదే.వ్యాపారాలు అవీ కాక.ఎన్.భాస్కర రావు అన్న ఒకాయన ఎం.ఎల్.సి. బిజూ జనతాదళ్ తరపున.


కవి సంగమం లో  తెలుగులు,ఒరియా వారు ఒకర్ని ఒకరు గౌరవించుకోవడం కనబడతుంది.మనవాళ్ళు ఒరియా లో పలకరిస్తే వాళ్ళు తెలుగు లో జవాబు ఇస్తారు.ఈ రివాజు రాయ గడ లో అంతటా ఉన్నది.పడుగు పేక లా అలా కలిసిపోయారు.ప్రఖ్యాత జె.కె.పేపర్స్ పరిశ్రమ వల్ల ఉపాధి ఒనగూరుతున్నది.ఇంకా ఎన్నో పరిశ్రమలకి ఆలవాలం ఈ నగరి.ఒక పాత దనం,కొత్త దనం రెండు ఇచట కనిపిస్తాయి. దానితో పాటే హాయినొసగే కొండలు కోనలు ఊరు కి చుట్టూతా..!మిగతా వివరాలు అన్నీ నా గత పోస్ట్ ల్లో రాశాను.వీలైతే చూడండి. ఆ అన్నట్టు..బాసుదేవ్ పాత్రో అనే పత్రికా విలేఖరి ,రచయిత ఆయన ఒరియా పుస్తకాల్ని బహూకరించారు.ఇంకొకటి..వీధిలో మనిషిని మనిషి చూడగానే ..యధాలాపంగా తుపుకు తుపుకు అని ఊసే  సంస్కృతి ఎప్పుడు పోతుందో..అదే విదేశాల్లో అయితే మొహం మీద కాసింత నవ్వు రువ్వుతారు...!