Showing posts with label భద్రాచల క్షేత్ర విశిష్టత. Show all posts
Showing posts with label భద్రాచల క్షేత్ర విశిష్టత. Show all posts

Thursday, July 25, 2013

సాయంత్రం పూట ఈ కట్టపైకి చాలా మంది వస్తుంటారు.

గోదావరి కి స్నానాల రేవు దగ్గరనుంచి ఇవతల పార్క్ దాకా వున్న కరకట్ట కి ప్రక్క వైపు రామాయణం లోని ముఖ్య సన్నివేశాల్ని బొమ్మల రూపం లో మలిచారు.ఇది కాస్త పొడవుగా వుండటం వల్ల ఆ పచ్చిక బయళ్ళలో కొంత మంది యాత్రికులు కూర్చుంటుంటారు.శ్రీరామ జననం దగ్గరనుంచి పట్టాభిషేకం వరకు ఘట్టాలు ఇక్కడ శిల్పాలు వున్నాయి.ఇవి బాపు-రమణల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నాయి చాన్నాళ్ళకిందట..!

సాయంత్రం పూట ఈ కట్టపైకి చాలా మంది వస్తుంటారు.అవతల వేపు గోదావరి చక్కగా అందంగా కనిపిస్తుంది.చల్లటి గాలి కూడా తగులుతుంది. వాకింగ్ కి కూడా జనాలు వస్తుంటారు.గోదావరి వరద ని ఇక్కడ నుంచి హాయిగా చూడవచ్చు. Click Here



Saturday, July 20, 2013

ఈ బ్రిడ్జి లేకపోతే భద్రాచలానికి గోదావరి లో పడవ దాటి రావలసిందే..!

ఈ బ్రిడ్జి లేకపోతే భద్రాచలానికి గోదావరి లో పడవ దాటి రావలసిందే..! 1958 కి ముందు అందరూ అలా వచ్చినవాళ్ళే..! భద్రాచలాన్ని బయటి ప్రపంచం తో కలిపే వారధి ఇది.పటేల్ అండ్ కో (ముంబాయి) వారు నిర్మించారు.1958 లో గోదావరికి భయంకరమైన వరదలు వచ్చిన సంగతి చాలామందికి తెలుసు.ఆ రోజుల్లో భక్తులు పడవలు లేదా లాంచీ ల మీదనే వచ్చేవారు.ఇంకో ముఖ్యమైన సంగతి ఏమిటంటే అప్పటిదాకా భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలోనే వుండేది.ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో కలిపారు.తెలంగాణా,ఆంధ్రా సంస్కృతి ఇక్కడ పడుగు పేకలా కలిసిపోయిందని చెప్పవచ్చు. 

అప్పుడు వచ్చిన వరదల మూలంగా అనేకమంది భక్తులు గోదావరిలో మునిగి మృత్యువాతపడ్డారు.దానితో ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి కి అంకురార్పణ చేశారు.దానితో ఆ బ్రిడ్జి అన్నిరకాల వాహనాలు పట్టణం లోనికి రావడానికి కారణభూతమౌతోంది. దానివల్ల ఒడిశా,చత్తిస్ ఘడ్ లాంటి రాష్ట్రాలకి కూడా భద్రాచలం నుండి రాకపోకలు సులువు అయ్యాయి.

ఈ వారధి  సుమారు 3 కి.మీ. వుంటుంది.అవతల వైపున సారపాక గ్రామం వుంటుంది.అక్కడనే ITC,Bhadrachalam papaer boards ఫ్యాక్టరీ వున్నది.     




Wednesday, July 17, 2013

ఇదివరకు వుచిత ప్రవేశమే గాని ప్రస్తుతం అయిదు రూపాయలు ప్రవేశ రుసుముగా చేశారు


భద్రాచలం లోకి అడుగుపెడుతుండగానే ముందుగా కుడివైపున అభయాంజనేయ స్వామి పార్క్ కనిపిస్తుంది.ఆ పార్కు కి కొంచెం ముందుకి వెళితే వచ్చే ఆంజనేయ స్వామి గుడి పేరుమీదుగానే ఈ పార్క్ ఏర్పడింది.చిన్న పిల్లలకి,పెద్దవాళ్ళకి సాయంత్రం అవగానే కాస్త ఓదార్పు లాగా వుంటుంది.ఇప్పుడు పచ్చదనం తో బాగానే అలరిస్తున్నది.కొంతమంది ప్రయాణీకులు ..గుడి కి వచ్చినవాళ్ళు ఇక్కడ అప్పుడప్పుడు సేద తీరుతుంటారు.

ఇదివరకు వుచిత ప్రవేశమే గాని ప్రస్తుతం అయిదు రూపాయలు ప్రవేశ రుసుముగా చేశారు.అయినా జనాలు బాగానే వస్తుంటారు.సెలవురోజుల్లోనైతే ఇంకొంచెం ఎక్కువేనని చెప్పాలి.ఇది ITC,Bhadrachalam Paper boards వారి సహకారం తో ముందు ఏర్పాటు అయ్యింది.

ఆసియా ఖండం లోని రెండవ పెద్ద పేపర్ మిల్లుగా చెప్పబడే ఇది ఈ పార్క్ కి ముందు గల బ్రిడ్జ్ దాటిన తరవాత సారపాక అనే ప్రదేశం లో వున్నది.ఈ పార్క్ కి ఎడమవైపున కరకట్ట వుంటుంది.దాని మీద రామాయణం లోని కొన్ని ఘట్టాలని బొమ్మల రూపంలో తీర్చిదిద్దారు. బాపు,రమణల సృజన ఇది.దాని గురించి ఇంకోసారి చెప్పుకుందాము. 

Wednesday, July 10, 2013

ధ్యాన మందిరం లో రామదాసు కీర్తనలన్నిటిని లోపలి గోడల పైన చెక్కించారు


రంగనాయకుల గుట్ట మీద గల ధ్యాన మందిరం రామాలయానికి చేరువలోనే వుంటుంది.అక్కడున్న ధ్యాన మందిరాన్ని 1962 లో నిర్మించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్ శంకుస్థాపన చేశారు దీనికి. ఆంధ్ర ప్రభ సంపాదకులుగా వున్న నీలం రాజు వెంకటశేషయ్య గారి కృషి చాలావున్నది ఈ నిర్మాణం వెనుక.

ధ్యాన మందిరం లో రామదాసు కీర్తనలన్నిటిని లోపలి గోడల పైన చెక్కించారు.ఒకప్పుడు అంటే ఇంచుమించు పాతికేళ్ళ వరకు సంగీతోత్సవాలు దీంట్లోనే జరిగేవి.జగత్ప్రసిద్దివహించిన పండిట్ రవిశంకర్ లాంటి వాళ్ళు సితార్ వాదనల్ని ఇక్కడ వినిపించారు.దక్షిణాది,ఉత్తరాది అనే భేదం లేకుండా ఎంతోమంది లబ్ద ప్రతిష్టులైన సంగీత కారులు ఇక్కడ తమ  విద్యని ప్రదర్శించారు.

ఇప్పటికీ డిసెంబర్ నెలలో ఈ ఆరాధనోత్సవాలు జరుగుతుంటాయి.అయితే ఇప్పుడు కళ్యాణ మండపం దగ్గర జరుగుతుంటాయి.మంగళంపల్లి,జేసుదాసు,హరిప్రసాద్ చౌరాసియా ఇలాంటి ప్రముఖులు
 ఇప్పుడెందుకనో అప్పటిలా వచ్చి కచేరీలు చేసినట్టుగా లేదు.

ధ్యాన మందిరం మీద సత్రాలు..ఇంకా ఇతర కాటేజీలు వున్నాయి.మంచి చల్లని గాలి వీస్తుంటుంది ఎప్పుడూ..!ఆ పైనుంచి చూస్తే గోదావరి ఒంపులు తిరిగినట్టుగా అందంగా కనబడుతుంది.
   















Monday, July 1, 2013

భద్రాచల క్షేత్ర విశిష్టత-3



రామాలయాన్ని సందర్శించుకున్నతరువాత చాలామంది ఆ ప్రక్కనే వున్న పర్ణశాలని కూడా దర్శించుకుంటారు.అది దాదాపుగా 35 కి.మి.వుంటుంది భద్రాచలం నుంచి..!అరణ్యవాస సమయంలో సీతా రాములు ఇక్కడ సంచరించినట్టు చెబుతారు.పర్ణశాలలో గోదావరి భద్రాచలం లో వున్నదాని కంటే వెడల్పుగా వుంటుంది.బోట్ షికారు చేయవచ్చును.

ఇక్కడ సీత వాగు అని చెప్పి ఒక ప్రవాహం వుంటుంది...సీతమ్మవారు ఇక్కడ స్నానమాచరించిందని చెబుతారు.నార చీరలు ఆరవేసుకున్న ప్రాంతాన్ని..రావణుడు వచ్చి గెడ్డ తో సహా పెకలించి తీసుకెళ్ళిన ప్రాంతాన్ని చూడవచ్చు.

ఏప్రిల్ మాసం లో భద్రాచలం లో జరిగే శ్రీరామనవమి కి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.అలాగే డిసెంబర్ లో ముక్కోటి ద్వార దర్శనానికి కూడా వస్తారు.ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం గుండా స్వామి వారు దర్శనమిస్తారు.ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే ఈ దర్శన భాగ్యం పొందిన వారికి మరు జన్మ వుండదని భక్తుల నమ్మకం...!

ఇంకా భద్రాచలం లో చూడవలసినవి ఏమైనా వున్నాయా..? కొన్ని వున్నాయి.రంగనాయకుల గుట్ట పై గల ధ్యాన మందిరం చూడవచ్చు.దీనిపైనుంచి గోదావరి.. వంపు తిరిగినట్టుగా అందంగా కనబడుతుంది.ఇక్కడ కొన్ని సత్రాలు..గెస్ట్ హౌస్లు వున్నాయి.గాలి కూడా చల్లగా వీస్తూ ప్రాణానికి హాయిగా అనిపిస్తుంది.భద్రాచలంలో భక్తులు నిర్మించిన సత్రాలుగాని,ప్రభుత్వం కట్టించిన వసతి గదులైతే నేమి,ఇంకా బయటి వారి లాడ్జి లైతేనేమి చాలానే వున్నాయి.టూరిజం వారి పున్నమి హోటల్ కూడా వున్నది.మామూలు సమయాల్లో ఏ ఇబ్బంది లేదు గాని శ్రీరామనవమి లాంటి ప్రత్యేక దినాల్లో కొంత వసతికి సంబందించి ముందు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.  

Sunday, June 30, 2013

భద్రాచల క్షేత్ర విశిష్టత-2



ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి మూలనుంచి భద్రాచలానికి బస్సు సౌకర్యం వున్నది.అటు అనంతపురం నుంచి,అదిలాబాద్ నుంచి,ఇంకా శ్రీకాకుళం నుంచి,చిత్తూరు నుంచి ఇలా ప్రతి జిల్లానుంచి భద్రాచలానికి బస్సు సౌకర్యం వున్నది.మద్రాస్ కి ఇంకా జైపూర్..రాయగడ ,జగదల్ పూర్ ఇలా ఇతర రాష్ట్రాలకి సైతం బస్సు సౌకర్యం నేరుగా వున్నది.ఒరిస్సా,చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దులు చాలా దగ్గర కూడా..!

దాని వల్ల ఏ జిల్లా నుంచైనా భద్రాచలానికి రావడం చాలా సులువు.ఐయ్తే రైలు ప్రయాణం చేసేవారు ఒకటి గుర్తుంచుకోవాలి.భద్రాచలానికి దగ్గరి రైల్వెయ్ స్టేషన్ కొత్తగూడెం అని గుర్తుంచుకోవాలి.ఇది ఇంచుమించు నలభై కి.మీ. దూరంలో వుంటుంది.దీన్ని భద్రాచలం రోడ్ అని వ్యవహరిస్తారు.ఇబ్బంది ఏమీ వుండదు..కొత్తగూడెం నుంచి ప్రతి 5 లేదా 10 నిమిషాలకి ఒక బస్సు వుంటుంది.

భద్రాచలం క్షేత్రం గూర్చి..!



భారత దేశంలో భద్రాచల క్షేత్ర విశిష్టత తెలియని వారు వుండరు.దక్షిణ అయోధ్యగా దీనికి పేరు.పౌరాణికంగా గానే గాక చారిత్రకంగా ఈ పట్టణానికి తనదైన ముద్ర వున్నది.ఇక్కడి రామాలయం అతి పురాతనమైనది.17 వ శతాబ్దం లో కంచెర్ల గోపన్న(1620-1680)  అనే  ప్రసిద్ది వహించిన ఒక రామభక్తుడు భద్రాద్రి రామునికి ఆలయం కట్టించాడు.ఈయన భక్త రామదాసుగా ఆ తర్వాత ప్రఖ్యాతి చెందాడు.దాశరధి శతకం వీరి విరచితమే..!

ప్రతి రోజు అనేకమంది భక్తులు రామాలయ సందర్శనార్దమై వస్తుంటారు.మన రాష్ట్రం నుంచి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడ భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు.సెలవురోజుల్లో ఈ సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక శ్రీరామ నవమి ,ముక్కోటి ఏకాదశి సమయాల్లో చెప్పనే అవసరం లేదు.ఇసకేస్తే రాలనంత జనాలు. సత్రాలు,బయటి లాడ్జిలు,ఇతర ఆవాసాలు కిక్కిరిసిపోతాయి.

(ఇంకావుంది)