Showing posts with label చరిత్ర. Show all posts
Showing posts with label చరిత్ర. Show all posts

Tuesday, December 17, 2013

ఎప్పుడైతే భద్రాచలానికి బ్రిడ్జ్ పడిందో అప్పటినుంచి లాంచీల ప్రాధాన్యత తగ్గిపోయింది.

లక్ష్మీనగరలో గల బ్రిటీషు వారి సమాధుల గురించి గతం లో ఓ పోస్ట్ ద్వారా తెలియబరిచాను.ఇలాంటి చారిత్రక ఆనవాళ్ళు కొన్నిటినైన మనం ఇల పదిలపరిచితే గతకాలం లోని అవశేషాలని ముందు తరాలవారికి ..ఈ ప్రాంత చరిత్ర పట్ల ఆసక్తి గలవారికి ఓ రికార్డ్ గా ఉపయోగపడుతుంది.ఈ సమాధులకి దగ్గరగా అంటే సుమారు నాలుగైదు ఫర్లాంగుల దూరం లో వున్న కెయిన్ పెట కి ఇటీవల వెళ్ళడం జరిగింది.ఓ పద్దెన్మిది ఏళ్ళ క్రితం చూసినప్పుడున్న కొన్ని నిర్మాణాలు మచ్చుకి కూడా లేకుండా శిధిలమై పోయాయి.అవన్నీ కూడా బ్రిటీష్ వారు తమ ఆవాసాలుగా నిర్మించుకున్నవే.



దుమ్ముగూడెం ఇంకా లక్ష్మీ నగరం జంటగ్రామాలు.ఇప్పుడంటే లక్షిమీనగరం బాగా అభివృద్ది చెందింది గాని గత కాలపు వైభవం అంతా దుమ్ముగూడెం దేనని చెప్పాలి. 1986 నుండి వచ్చిన గోదావరి వరదలవల్ల దుమ్ముగూడెం క్షీణించింది.మండల కార్యాలయాలన్ని ఆ దాపునే ఉన్న లక్ష్మీనగరానికి తరలిపోయాయి.ఒక్క హైస్కూల్,పోస్టాఫీసు ,కాలేజి లాంటివి ఇక్కడ మిగిలాయి.అయితే ఇప్పుడు నిర్మితమవుతున్న హైడల్ ప్రాజెక్ట్ వల్ల మళ్ళీ దుమ్ముగూడెం కి ప్రాభవం వచ్చేలాగున్నది.



1865 ప్రాంతం లో కెప్టెన్ గ్లాస్ ఫోర్డ్ అనే బ్రిటీష్ అధికారి ఎగువ గోదావరి జిల్లా మీద ఇచ్చిన రిపోర్ట్ లో ఈ డివిజన్ గురించి బాగా వివరం గా రాశాడు.దాని ప్రకారం భద్రాచలం కంటే దుమ్ముగూడెం గ్రామమే పెద్ద వాణిజ్య,వ్యవసాయ కేంద్రం గా వుండేది.జనాభా కూడా ఎక్కువ గా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చారు. దుమ్ముగూడెం నుంచి రాజమండ్రి కి లాంచీ ల ద్వారా ట్రాన్స్ పోర్ట్ జరిగేది.ఎప్పుడైతే భద్రాచలానికి బ్రిడ్జ్ పడిందో అప్పటినుంచి లాంచీల ప్రాధాన్యత తగ్గిపోయింది.



సరే..అదలా వుంటే ఈ కెయిన్ పేట అనేది బ్రిటీష్ వాళ్ళు దుమ్ముగుడెం ని ఆనుకుని నిర్మించినట్టిది.ఇది వారి కొరకు నిర్మించుకున్న సెటిల్మెంట్ గా చెప్పవచ్చు.ఇక్కడ నావిగేషన్ కేంద్రం...వర్క్ షాప్...ఒక చర్చ్...వారి ఇళ్ళు  వుండేవి. ఊరితో సంబందం లేకుండా ప్రత్యేకం గా ఉంటుందిది.




ఇటీవల నేను ఈ ప్రదేశాన్ని సందర్శించినపుడు మిగిలి వున్న ఒకే ఒక్క అప్పటి భవనాన్ని చూడడం జరిగింది.మిగతావన్నీ కాలగర్భం లో కలసిపోయినాయి.ఇది కూడా శిధిలావస్థకి చేరువలో ఉన్నది.కనుక దానికి సంబందించిన కొన్ని ఫోటోలు తీసి ఇక్కడ ఇస్తున్నాను.  ఈ భవనం ని సున్నం,ఇసుక లాంటివి వాడి నిర్మించారు.కాని ఇప్పటి దిట్టం గానే వున్నది.అయితే పై కప్పులు అక్కడక్కడ వీక్ అయినాయి.లోపలికి ప్రవేశించగానే విశాలమైన గదులు,ధారళంగా వెలుతురు గాలి వచ్చే విధం గా ఉన్నాయి.పైన కూడ ఇంకో అంతస్తు ఉన్నది.ఆ పైన టాయ్లెట్ కూడా ఉన్నది.పై నుంచి చూస్తే ఏరియల్ వ్యూ చాలాదూరం కనిపిస్తుంది.



చుట్టుప్రక్కల దట్టమైన వృక్షాలు ..నిర్మానుష్యం గా ఉన్నది.చాలా చల్లగా అనిపించింది.ఒక రెండు కుటుంబాలు ఇక్కడ ఉన్నట్టు తోచింది.ప్రస్తుతం చర్చ్ కి సంబందించిన పేద పిల్లల వసతి గృహం గా వాడుతున్నారు ఈ నిర్మాణాన్ని.  

Saturday, July 13, 2013

గొప్ప సిద్దపురుషుడు..కృష్ణభక్తుడు...అయిన ఆయన ఒకేసారి 5 గురు వ్యక్తులుగా దర్శనమిచ్చేవారట



భద్రాచలం లో రామాలయం చూసిన తర్వాత మీకు వీలుంటే ఆ ప్రక్కనే కొద్ది దూరం లో ఉన్న కుసుమ హరనాధ బాబా మందిరానికి కూడా వెళ్ళవచ్చు.అక్కడ జనసందోహం అంతగా వుండదు.మందిరం కూడా చాలా నాళ్ళ క్రితం నిర్మించినది.కాని గొప్ప ప్రశాంతంగా వుంటుంది.చల్లగానూ వుంటుంది బాగా ఎత్తులో వుండటం వల్ల..! అక్కడినుంచి రామాలయం..ఇంకా పట్టణం మంచిగా కనిపిస్తుంది.



హరనాధ బాబా పశ్చిమ బెంగాల్ లో జన్మించిన సాధుపుంగవులు.ప్రపంచం లో వుంటూనే ప్రపంచాతీతంగా మనిషి ఎదగవచ్చుననేది వారు బోధించారు.ఆయన 1865 జూలై 1 న బంకూరా జిల్లాలో జన్మించారు.స్వయంగా గృహస్తుగా వుంటూనే రుషిసత్తమునిగా పేరుపొందారు.ఆయన జీవిత కాలం లో ఒక విన్నుత్న పద్దతిని ఎన్నుకున్నారు.ప్రతి రోజూ 15 నుంచి 20 వుత్తరాలు రాసేవారు.అలా కొన్ని వేల వుత్తరాలు రాసి ప్రజల్లో ని అనేక సందేహాలు తీర్చుతూ ...దైవాన్వేషణలో  తన సలహాలనిస్తుండేవారు.



గొప్ప సిద్దపురుషుడు..కృష్ణభక్తుడు...అయిన ఆయన ఒకేసారి 5 గురు వ్యక్తులుగా దర్శనమిచ్చేవారట. ఇలా వారి గురించ్చి చెప్పాలంటే చాలా వున్నది. ఆ మందిరం పరిసరాలు పచ్చగా వుండి ఆహ్లాదకరంగా వుంటుంది వాతావరణమంతా ...!వాటికి సంబందించిన కొన్ని చిత్రాలు ఇక్కడ  పొందుపరుస్తున్నాను.          

Friday, July 12, 2013

లక్ష్మి నగరం లో గుర్తు పట్టడానికి వీల్లేకుండా అయిపోయిన ఆ సమాధుల గురించి రాయడం ఇన్నాళ్ళకి కుదురుతోంది.

లక్ష్మి నగరం లో గుర్తు పట్టడానికి వీల్లేకుండా అయిపోయిన ఆ సమాధుల గురించి రాయడం ఇన్నాళ్ళకి కుదురుతోంది.లక్ష్మి నగరం అంటే ఇది భద్రాచలానికి రమారమి ఓ 25 K.m. ఉంటుంది.పర్ణశాలకి వెళుతుంటే మధ్యలో తగులుతుంది. నేను 20 యేళ్ళ క్రితం ఓ దిన పత్రిక లో విలేఖరి గా పనిచేసే టప్పుడు "తెల్ల వాళ్ళ సమాధులు " గురించి జనాలు మాట్లాడు కొంటుంటే ఆసక్తి కొద్ది ఒకళ్ళని అడిగాను.ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు దుమ్ముగూడెం పరిసర ప్రాంతాల్లో ఉండేవారని ,వారు చనిపోయింతరవాత లక్ష్మీ నగరం లో సమాధి చేసే వారని..చెప్పారు.చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన వాడిగా యెందుకో ఆ ప్రాంతానికి వెళ్ళాను..! మన వార్త రచనకి కూడా పనికి రావచ్చేమో ననిపించడం ఓ కారణం.

నాలగు గోడల ప్రహరి...ముందు ఓ ఇనుప గేటు...లోపల పిచ్చి మొక్కలు పెరిగాయి.నాకు యెందుకో ఓ గొప్ప చరిత్రే అక్కడ పడుకున్నట్టు తోచింది.మంచి నునుపైన రాళ్ళతో సమాధుల్ని నిర్మించారు.వాటి మీద మృతుల వివరాల్ని కూడా చెక్కారు.నాకు వెళ్ళగానే దారిలో కనిపించిన సమాధిని పరిశీలించాను.దాని పైన రాసిన దాన్ని బట్టి అతడి పేరు "Angus alstair Fernadez" ,అతను ఒక I.C.S. అధికారి.. భద్రాచలం యేజన్సీ కి సబ్ కలక్టర్ మరియు స్పెషల్ యేజంట్  గా పనిచేసినట్టు లిఖించబడి  ఉంది. 1918 ప్రాంతంలో మరణించి నట్టు తెలియజేయబడింది.

దానికి ప్రక్కన Dorothy,sarah clair అనే వాళ్ళ సమాధులు ఉన్నాయి.వాళ్ళు ఉపాధ్యాయినులు.వాటికి ముందు చాల యెత్తుగా ఉన్న సమాధి "Charlotte Henrita" అనే అమ్మాయిది.ఆమె ఆనాటి "Inspector general of Hospitals,Madras" యొక్క కుమార్తె.మరి ఇంత దూరంలో ఇక్కడికి తీసికొచ్చి యెందుకు సమాధి చేశారా అని ఆలోచిస్తే నాకు తోచింది యేమంటే ఇక్కడ వున్న తమ బంధువులు దగ్గరకి వచ్చినప్పుడు మరణించి ఉండవచ్చునేమో ననిపించింది.

ఆర్మీ లో పనిచేసి retire అయిన ఒక వృద్దుణ్ణి అప్పుడు చిన్న interview చేశాను.ఆయన ఇల్లు సమాధుల కి  దగ్గరగానే ఉండేది. ఆ కాలంలో ఇక్కడి దగ్గర్లో ఉన్న దుమ్ముగూడెం navigation work shop గా ఉండి చాలా మంది బ్రిటీష్ జాతీయులతో నిండి వుండేదని చెప్పాడు.తాను చిన్నప్పుడు Dorothy,sarah clair అమ్మ గార్ల వద్దనే చదువు కున్నానని తెలిపాడు. వాళ్ళు పేద ప్రజలకి వుచితంగా చదువు చెప్పి ఉద్యోగాలు కూడా ఇప్పించడంలో సహాయం చేసే వారని యెంతో Thankful గా చెప్పాడు.

ఇటీవల ఆ ప్రాంతం వెళితే గుర్తు పట్టకుండా మారిపోయింది.ప్రహరీ అయితే ఉందిగాని పెద్ద అరణ్యం లా చెట్లు పెరిగిపోయాయి.సమాధుల్ని కూడా యెవరో పెకిలించినట్లుగా అయ్యాయి.మన దేశంలో నివసించిన ప్రతి బ్రిటీష్ వాడు ఒక డయ్యర్ కావాలని యేముంది...ఒక Brown ఉండి వుండవచ్చు...ఒక కాటన్ వుండి వుండవచ్చు.ఆ సమాధుల్ని చారిత్రిక ఆనవాళ్ళుగా పదిల పరిస్తే బాగుంటుంది.

           


















ఈ పాత ఫోటో సారా క్లెయిర్ దంపతులది.. మాల్య శ్రీ గారి దగ్గర వుంటే తీసుకొని ఇక్కడ ప్రచురించాను.మిగతా సమాధులన్నీ నేనే ఫోటో తీశాను.అయితే ఓ పది సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు మరీ ఇంతగా శిధిలమవ్వలేదు.