Exposure Tour
13-4-2024
![]() |
పాఠశాల లో చదివే విద్యార్థినీ విద్యార్థులకు ఆహ్లాదము తో పాటు, వారి మేధ ను వికసింపజేసే విజ్ఞానం కూడా అవసరం. బయట ప్రపంచం లో గల విశేషాలను ప్రత్యక్షం గా చూసినపుడు పిల్లలలో కొత్తద్వారాలు తెరుచుకుంటాయి. ఆ కారణం చేతనే ది.13-4-2024 తేదీ నాడు శ్రీనన్నపనేని మోహన్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కి చెందిన పిల్లలు,ఉపాధ్యాయులు అంతా కలిసి టూరిస్ట్ బస్సులలో ఎక్స్ పోష్యూర్ టూర్ కి బయలుదేరినాము. భద్రాచలం లో చాలా పొద్దుటపూట ఈ టూర్ ని ప్రారంభించాము. ములుగు జిల్లా లో ఉన్న ప్రపంచ ప్రసిద్ది గాంచిన రామప్ప గుడి ని అలాగే ఇంజనీరింగ్ అద్భుతం గా చెప్పదగిన లక్నవరం బ్రిడ్జ్ ని, సింగరేణి కి తలమానికమైన మణుగూరు ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ని మేము సందర్శించినాము.
మొదటిగా మణుగూరు ఓపెన్ కాస్ట్ దగ్గర ఆగాము. అక్కడ ఉన్న సిబ్బంది తో మాట్లాడి విశేషాలు తెలుసుకున్నాము.ఇక్కడ సంవత్సరానికి 6.25 మిలియన్ టన్నుల బొగ్గుని వెలికి తీస్తారని తెలుసుకున్నాము.దీనికి అనుసంధానంగా ఓపెన్ కాస్ట్ -4 లో మరో 3.5 మిలియన్ టన్నుల బొగ్గు లభ్యమవుతుందని చెప్పారు.అక్కడ బొగ్గు ని తవ్వి, లారీల తో తీసుకుపోతుండడం గమనించాము. మట్టి కూడా పెద్ద మేటలుగా ఉండటాన్ని చూశాము.అక్కడ కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాము. దీనివల్ల బొగ్గు ఓపెన్ కాస్ట్ విధానం లో ఎలా తీస్తారు అనేది ప్రత్యక్షంగా చూసి అర్ధం చేసుకున్నాం.
ఆ తర్వాత బస్సులు ఎక్కి కొంత దూరం ప్రయాణించిన తర్వాత అంతా దిగి అల్పాహారం తీసుకున్నాము. అక్కడ నీటి సదుపాయం మరియు చక్కని పచ్చని చెట్లు ఎంతో శోభాయమానం గా అనిపించాయి. అది కరకగూడెం కి సమీపం లో గల అటవీ ప్రాంతం. ఆ పిమ్మట ములుగుజిల్లా లో కి ప్రవేశించాము. మా బస్సులు పాలం పేట లో చరిత్ర ప్రసిద్ది వహించిన రామప్ప గుడి కి చేరుకున్నాయి. ఈ టూరిస్ట్ ప్రదేశానికి దేశ,విదేశాల నుంచి ప్రజలు వస్తుంటారు. అంతే కాదు యునెస్కో కూడా ఈ నిర్మాణాన్ని హెరిటేజ్ లిస్ట్ లో చేర్చడం తో గొప్ప ప్రాముఖ్యత చేకూరింది. ఎంతో క్రమశిక్షణ తో ఆలయం లోని ప్రతి భాగాన్ని పరిశీలించినాము.
ఆలయం గోడలపై చెక్కబడిన రకరకాల శిల్పాల గురించి ఎంతైన చెప్పవచ్చు. నాట్యకారిణుల భంగిమలతో ఉన్న శిల్పాలు అద్భుతం గా ఉన్నాయి. ఏనుగులు ఇంకా ఇతర జంతువుల యొక్క శిల్పాలు కూడా ఉన్నాయి.ప్రాకారాలు రకరకాల డిజైన్లతో ఎంతో అందం గా ఉన్నాయి.కొన్ని శిల్పాలు,గుడుల భాగాలు శత్రుసేనల తాకిడికి గురయినట్లు గా తోచాయి.అయినప్పటికి నిలిచిఉన్న నిర్మాణాలు ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని వద్ద సేనాని గా ఉన్న రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. సా.శ. 1213 నుంచి ఈ నిర్మాణం అంచెలు అంచెలుగా సాగి సా.శ.1234 లో పూర్తయింది. శివుడు లింగాకార స్వరూపం లో ఇచట దర్శనమిస్తారు.
కాకతీయుల నాటి శిల్ప వైభవానికి ఈ ఆలయం మచ్చుతునక. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ నిర్మాణాన్ని తన పరివారం తో, తన మేధో సంపత్తి తో డిజైన్ చేసి కట్టిన గొప్ప శిల్పి రామప్ప, ఆయన పేరు మీదు గానే ఈ ఆలయాన్ని పిలవడం ప్రపంచం లో ఎక్కడా లేని ఆశ్చర్యకరమైన విశేషం.భూకంపం వచ్చినా తట్టుకునే విధంగా సాండ్ బాక్స్ టెక్నాలజీ ని ఆ రోజుల్లోనే ఉపయోగించారు.ఇలాంటి ఎన్నో గొప్ప విషయాల్ని ఇక్కడ కి వచ్చినందువల్ల తెలుసుకోగలిగాము.ఇటాలియన్ చరిత్రకారుడు మార్కోపోలో, రామప్ప ఆలయాన్ని చుక్కల్లో చంద్రుని వంటిదని ప్రశంసించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమైన అంశం.
ఆ తర్వాత లక్నవరం చెరువు ని అక్కడగల సస్పెన్షన్ బ్రిడ్జ్ ని సందర్శించాము. ఇది వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ప్రస్తుతం ఈ లక్నవరం అనేది టూరిస్ట్ కేంద్రంగా గొప్ప ప్రాచుర్యం పొందింది.ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడకి వస్తున్నారు.కాకతీయుల కాలం లోనే, ఇక్కడ ఉన్న ఎత్తైన గుట్టల నుంచి కిందికి వచ్చే నీటిని ఈ ప్రాంతం లో చెరువు గా అభివృద్ది చేసి చుట్టు పక్కల ఉన్న గ్రామాల కి నీటి సౌకర్యాన్ని కల్పించారు. ఆ పిమ్మట ఇక్కడ ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ ఒక వండర్ గా చెప్పవచ్చు. దాని మీది నుంచి నడుస్తూ ప్రకృతి ని చూస్తే అద్భుతంగా ఉంటుంది.చెరువు లో బోట్ లు,స్టీమర్లు ఉన్నాయి.
అంతా కలిసి బోట్ లో ఎక్కి చెరువు లో ప్రయాణించాము. అక్కడ బస చేయడానికి కూడా దగ్గర లో ఏర్పాట్లు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్ట్ లు ఇక్కడ ఉంటారని తెలిసింది. ములుగు జిల్లా లో గల గోవిందరావు పేట మండలం లో ఈ లక్నవరం పర్యాటక ప్రాంతం ఉన్నది. రామప్ప గుడి కి 29 కి.మీ. దూరం లో ఉన్నది. ఆ ప్రదేశం లో పిల్లలం అంతా ఆనందంగా గడిపాము. విజ్ఞాన విశేషాల్ని గ్రహించాము.ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు మాకు ఎంతగానో తోడ్పాటు అందించినారు.
ఇట్లు
విద్యార్థుల డాక్యుమెంటేషన్ కమిటీ.
No comments:
Post a Comment
Thanks for your visit and comment.