అది ఒక నిర్జన అరణ్య ప్రదేశం.ఇంచుమించు మూడు వందల మీటర్లు పైగా ఎత్తున్న గుట్టలు.దట్టంగా అల్లుకున్న లతా గుల్మములు,రకరకాల మొక్కలు ,వృక్షాలు ఒకదానినొకటి పెనవేసుకొని ఆ గుట్టల్ని కాపాడుతున్నవా అన్నట్లు గా ఉన్నది ఆ దృశ్యం.మూడు వైపులా గుట్టల్ని ఆలంబనగా చేసుకొని బ్రహ్మాండమైన చెరువు ..వాని లో చిన్న చిన్న కలువలు..ఒకసారి చూస్తే జీవితమంతా వెంటాడే సుందర ప్రకృతి అది.
వీటి అన్నిటిని మించి కొన్ని వేల చరిత్ర అక్కడ మరుగున పడి ఉన్నది.ఇన్ని ఏళ్ళ బాటు ఎండకి,వానకి,వాతావరణ విలయ నృత్యాలకి తట్టుకొని ఇంకా ఆ మాత్రమైనా అవి ఉన్నాయి అంటే అంతా స్వతహ్ సిద్ధ రక్షణ వల్ల నే నేమో..!ఇంతకీ అవి ఏమిటి అంటారా ..రాతి యుగం నాటి మనుషులు నిర్మించిన నిర్మాణాలు అవి.మన వాళ్ళు రాక్షస గుళ్ళు అంటూంటారు.ఆంగ్లం లో Dolmens గా వ్యవహరిస్తారు.నాలుగు వైపులా బలమైన ఆధారాలు గా రాళ్ళను పేర్చి వాటి పై కప్పు లా ఒకే ఏకాండి రాయిని చాలా వెడల్పైనదాన్ని అమర్చారు.నేను చదివిన సమాచారం ప్రకారం ఇంచుమించు క్రీ.పూ.7000 సం.ల నుండి క్రీ.పూ. 3000 సం.ల మధ్యలో నిర్మించి ఉండవచ్చును.
ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉంది అంటారా..?
ఖమ్మం జిల్లా లోగల వెంకటాపురం మండలం లోని సూరవీడు గ్రామానికి చేరువ లో ఉన్న అడవి లో ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే ఆ ప్రాంతాన్ని కాముని చెరువు ,ఇంకా చేరువ లోని గుట్టలు గా పిలుస్తారు.ఇక్కడి గుట్టలు ఈ చెరువు ని చూస్తున్నట్లు ఉంటాయి.అదిగో ఈ గుట్టల పైనే ఉన్నాయి ఈ పురా తత్వ విశేషాలు.అంత బరువైన ఆ రాతి పలకల్ని ఏ విధంగా పైకి చేర్చారు అంటే చెప్పడము కష్టమే.ఒకటా..రెండా..పైకి ఎక్కి చూస్తున్న కొద్దీ ఆ పొడుగూతా కొన్ని డజన్ల కొద్దీ ఉన్నాయి.మేము గుట్టకి సగ భాగం మాత్రమే ఎక్కాము..అక్కడే అన్ని ఉంటే ఇంకా పైకి ఎక్క గలిగితే ఇంకా ఎన్ని కనిపించేవో...అయితే అలసట వల్ల కిందకి దిగేశాము.
దురదృష్టం ఏమిటంటే కొన్ని నిర్మాణాల్ని పెళ్ళగించినట్లు అగుపించాయి.వాళ్ళ పిచ్చి కాకపోతే రాతి యుగం నాటి ఆ మానవులు అక్కడ ఏ బంగారం ఏ నిధులు లోపల పెట్టి ఉంటారని ఈ తవ్విన వాళ్ళ ఆలోచన.చరిత్ర తెలియక పోతే వచ్చే చావు ఇదే.అపురూప మైన ఈ నిర్మాణాల్ని స్థాన భ్ర్మంశం చేశారు..కొన్ని చోట్ల.దేశం లోను,రాష్ట్రం లోనూ ఇంకా నెదర్లాండ్ ,ఫ్రాన్స్,పోర్చుగల్,బ్రిటన్ లాంటి ఎన్నో దేశాల్లో ఇలాంటి ప్రాచీన అవశేషాల్ని రక్షిస్తున్నారు.పర్యాటకులూ వస్తుంటారు.
మిత్రులు నరేంద్ర గారు వారం రోజులు ముందు ఒక రాత్రి ఫోన్ చేసి చెప్పారు.విహార యాత్ర కని..అది కాస్త ట్రెక్కింగ్ గా పరిణమించింది.బాబ్జి అన్న,మురళి గారు,రవి గారు,సతీష్ గారు ఇంకా మిగతా పరివారం బయలుదేరాము.నలుగురం మాత్రం పైకి ఎక్కగలిగి కొన్ని ఫోటోలు తీయగలిగాము.చిన్న పిల్లలు కూడా ఈ ట్రెక్కింగ్ లో ఉత్సాహంగా ఫాల్గొనడం ఉత్తేజకరం గా అనిపించింది.
నరేంద్ర గారు వీటిని చూసి ..ఇవి సమాధులు కావు కాని ప్రాచీన మానవుడు తాను తల దాచుకోవడానికి కట్టుకొని ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆయన పరిశోధనల మీద మంచి ఆసక్తి ఉన్న వ్యక్తి.నాకూ అది కరక్టే అనిపించింది.కొన్ని వేల కిందట అవి కొంత ఎత్తు గానే ఉండి కాల క్రమం లో కుంగి పోయి ఉండవచ్చునని అన్నారు.అయితే ప్రొ.శుభాసిస్ దాస్ వంటి వారు మాత్రం ఇవి బహుశా Memorials వంటివి అయి ఉండవచ్చునని ..అయితే ఏదీ పూర్తి గా నిర్ధారించలేమని చెబుతున్నారు.సరే..ఎవరూ మాత్రం కాలం లో వెనక్కి అంత దూరం వెళ్ళి చూసి రాగలరు.అయితే ఇవి మాత్రం Tombs మాత్రం కావు అని చెప్పవచ్చు.ఎందుకంటే అలాంటి వాటిని చర్ల మండలం కలివేరు గుట్టల మీద నరేంద్ర గారు నేను చూశాము.అవి మనిషి సైజులో కాఫిన్ ల వలె అంటే రాతి కాఫిన్ ల వలే ఉన్నాయి.ఇవి మాత్రం చాలా పెద్ద గా ఉన్నాయి వాటి తో పోలిస్తే..లోపల మనిషి కూర్చోడానికి,పడుకొని ఇటూ అటూ దొర్లే సైజు లో ఉన్నాయి. కొన్ని నిర్మాణాల రాళ్ళు పక్కకి ఒరిగి పోయి ఉన్నాయి.మరి ఎంత కాలం ..ఎన్ని రుతువుల,ఎన్ని వాతావరణ వైరుధ్యాల్ని చూస్తూ అక్కడ కాలం గడుపుతున్నాయి అవి మరి.
( Technical details of place : Latitude: 18.094297,Longitude : 80.785013)
No comments:
Post a Comment
Thanks for your visit and comment.