Tuesday, July 2, 2013

ఒక మహా యోగి యొక్క ఆత్మీయ స్పర్శ అక్కడ వున్నది.

పేరంటాల పల్లి...ప్రస్తుతం ఈ పర్యాటక ప్రదేశం అనేక ప్రాంతాల నుండి పర్యాటకులని విపరీతంగా ఆకర్షిస్తోంది.ఒక్క సారి వచ్చినవారు ఈ సౌందర్యాత్మక ప్రపంచంలోకి మళ్ళీ రావాలని అనుకోవడంలో వింత లేదు.



గోదావరి ప్రవాహం మధ్య నుండి అలా బోట్ దూసుకు పోతూవుంటుంది.అటూ ఇటూ బ్రహ్మాండమైన పాపి కొండలు..చక్కని ప్రకృతి శోభ.. అందమైన ఇసుక తిన్నెల లో వెన్నెల లో విహారం.. ఇదంతా పేరంటాల పల్లి కి వచ్చి చూడవలసిందే..తప్ప చెబితే తెలియదు ఆ ఆహ్లాదం.



ఇక్కడ పేరంటాల పల్లి లో ఆ కొండల మధ్యన రామకృష్ణ మునివాటం అని ఒక ఆశ్రమం వున్నది.
అది ఎప్పుడో దాదాపుగా 60 లేదా 70 ఏళ్ళ కిందట బాలానంద స్వామి అనే ఒక యోగి పుంగవులు నిర్మించినది.అప్పుడు ఈ చాయలకి ఎవరూ వచ్చేవారు కారు. నిర్మానుష్యంగా వుండేది.అక్కడ ఆయన తపస్సు చేసుకునేవారు. స్వామి ఇంగ్లీష్ భాషలో కూడా మంచి ప్రావీణ్యం కలవారు.వారు రాసిన "Spiritual inquiry" (1960 లలో ముద్రితం) అనే ఆంగ్ల గ్రంధాన్ని ఒక సారి ఇక్కడి ఆశ్రమవాసులనుంచి తీసుకున్నాను.అది దాదాపుగా పాతికేళ్ళకిందటి మాట. అప్పుడీ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా ఎవరికీ తెలియదు.స్వామి  వారు ఆ కీకారణ్యం లో ఎంతో సాధన చేసి రాసిన ఆ విషయాలు చాలా అమూలయమైనవి..పూర్వ జన్మలు గురించి.. ఆ రోజుల్లోనే అంత మహా గ్రంధాన్ని వెలువరించడం అత్యంత ఆశ్చర్యకరం.!



ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కేవలం దీన్ని ఒక పిక్నిక్ ప్రదేశంగానే చూస్తూ garbage మయం చేయకూడదని..! అడ్డమైన చెత్తతో నింపకూడదని..!
ఒక మహా యోగి యొక్క ఆత్మీయ స్పర్శ అక్కడ వున్నది.



భద్రాచలం వచ్చిన వారు ఇప్పుడు తప్పక పేరంటాల పల్లి టూర్ (Boat cruise) కూడ  వెళుతున్నారు.ఈ అందమైన ప్రదేశం భద్రాచలానికి సుమారు 75 కి.మి.వుంటుంది.భద్రాచలం నుండి టూర్ ని కండక్ట్ చేస్తారు.గుడికి దగ్గర్లో,బస్టాండ్ దగ్గర్లో ఇంకా ఇతర చోట్లలో కూడా దీనికి సంబందించిన ఏజంట్లు వున్నారు.



ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.  

No comments:

Post a Comment

Thanks for your visit and comment.