Monday, July 1, 2013

భద్రాచల క్షేత్ర విశిష్టత-3



రామాలయాన్ని సందర్శించుకున్నతరువాత చాలామంది ఆ ప్రక్కనే వున్న పర్ణశాలని కూడా దర్శించుకుంటారు.అది దాదాపుగా 35 కి.మి.వుంటుంది భద్రాచలం నుంచి..!అరణ్యవాస సమయంలో సీతా రాములు ఇక్కడ సంచరించినట్టు చెబుతారు.పర్ణశాలలో గోదావరి భద్రాచలం లో వున్నదాని కంటే వెడల్పుగా వుంటుంది.బోట్ షికారు చేయవచ్చును.

ఇక్కడ సీత వాగు అని చెప్పి ఒక ప్రవాహం వుంటుంది...సీతమ్మవారు ఇక్కడ స్నానమాచరించిందని చెబుతారు.నార చీరలు ఆరవేసుకున్న ప్రాంతాన్ని..రావణుడు వచ్చి గెడ్డ తో సహా పెకలించి తీసుకెళ్ళిన ప్రాంతాన్ని చూడవచ్చు.

ఏప్రిల్ మాసం లో భద్రాచలం లో జరిగే శ్రీరామనవమి కి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.అలాగే డిసెంబర్ లో ముక్కోటి ద్వార దర్శనానికి కూడా వస్తారు.ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం గుండా స్వామి వారు దర్శనమిస్తారు.ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే ఈ దర్శన భాగ్యం పొందిన వారికి మరు జన్మ వుండదని భక్తుల నమ్మకం...!

ఇంకా భద్రాచలం లో చూడవలసినవి ఏమైనా వున్నాయా..? కొన్ని వున్నాయి.రంగనాయకుల గుట్ట పై గల ధ్యాన మందిరం చూడవచ్చు.దీనిపైనుంచి గోదావరి.. వంపు తిరిగినట్టుగా అందంగా కనబడుతుంది.ఇక్కడ కొన్ని సత్రాలు..గెస్ట్ హౌస్లు వున్నాయి.గాలి కూడా చల్లగా వీస్తూ ప్రాణానికి హాయిగా అనిపిస్తుంది.భద్రాచలంలో భక్తులు నిర్మించిన సత్రాలుగాని,ప్రభుత్వం కట్టించిన వసతి గదులైతే నేమి,ఇంకా బయటి వారి లాడ్జి లైతేనేమి చాలానే వున్నాయి.టూరిజం వారి పున్నమి హోటల్ కూడా వున్నది.మామూలు సమయాల్లో ఏ ఇబ్బంది లేదు గాని శ్రీరామనవమి లాంటి ప్రత్యేక దినాల్లో కొంత వసతికి సంబందించి ముందు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.  

No comments:

Post a Comment

Thanks for your visit and comment.