EXPOSURE VISIT - 2
----------------------------------
01-02-2025
ప్రపంచ ప్రసిద్ధి వహించిన కాకతీయులు నిర్మించిన కోట ని, వెయ్యి స్థంభాల గుడిని,అదే విధంగా భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని ఓరుగల్లు నగరం లో తిలకించుటకు గాను బయలుదేరాము. మా పాఠశాల నుంచి ఉదయం ఆరు గంటలకే విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం అంతా టూరిస్ట్ బస్సులలో ఎక్కి ఉల్లాసంగా ప్రయాణించి మధ్యానం కల్లా ఖిల్లా లేదా కాకతీయుల కోట దగ్గరకి చేరుకున్నాము.
కాకతీయులు నిర్మించిన కోట యొక్క శిధిలాలు చాలా చోట్ల చెల్లా చెదురుగా కనిపించాయి. అలాగే ఇప్పటికీ ధృఢంగా ఉన్న ప్రాకారాలు,రాతి తో నిర్మించిన కళా తోరణాలు , ఇతర నిర్మాణాలు కనిపించాయి. ఈ కోట హన్మకొండ-వరంగల్ మధ్య భాగం లో 19 కి.మీ.రేడియస్ లో నిర్మించబడింది. సా.శ.1199-1262 మధ్య కాలం లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఈ కోటని నిర్మించాడు.
కాకతీయ తోరణం గా ప్రఖ్యాతి వహించిన కట్టడం మన రాష్ట్ర ఎంబ్లెం లో చోటు చేసుకున్నదంటే దీని విశిష్టతని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన రాళ్ళ ని నునుపు చేసి వాటిని ఉపయోగించి కోట కి సంభందించిన శిల్పాకృతుల్ని తయారుచేశారు. ఇప్పటికీ గంభీరంగా నిలుచుని ఉన్న కాకతీయ కళాతోరణాలు గత కాలపు వైభవాన్ని గుర్తుచేస్తాయి. శిల్పుల నైపుణ్యాన్ని తెలియజేశాయి. శత్రువుల దాడుల్లో ధ్వంసం అయిన కొన్ని శిథిలాల్ని చూసినపుడు బాధగా అనిపించింది.
ప్రతపరుద్రుని కాలం సువర్ణపాలనగా పేరుగాంచింది. మాలిక్ కాఫర్,కుతుబుద్దీన్ ముబారక్,ఘియాసుద్దీన్ తుఘ్లక్ లాంటి శత్రుపాలకులు ఈ కోట పై అనేకమార్లు దాడి చేసి ఎంతో విలువైన సంపదని దోచుకున్నారు. నిజాం కాలం లో ఇక్కడ ఉన్న ఒక విశాలమైన రాతి భవనాన్ని షితాబ్ ఖాన్ మహల్ గా మార్చారు. ఇంకా అనేక నిర్మాణాల రూపురేఖల్ని మార్చినట్లు అగుపించింది.
ప్రస్తుతం వరంగల్ అని పిలుస్తున్న ఈ నగరాన్ని ఒకప్పుడు ఓరుగల్లు మరియు ఏకశిలానగరం అని పిలిచేవారు. కోట పక్కనే గల శివాలయం కూడా అద్భుతమైన శైలి తో ఉన్నది. అందరము కొన్ని ఫోటోలు దిగాము.సమీపం లో ఒక పార్కు ఉన్నది.అక్కడ ఆహ్లాదకరంగా గడిపినాము. అక్కడి నుంచి ఒక కొండ కి దారి ఉన్నది. ఆ పైన కూడా చరిత్ర ప్రసిద్ది చెందిన ఆలయం ఉన్నది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం హెరిటేజ్ సిటీ డెవెలప్మెంట్ అండ్ ఆగ్ మెంటేషన్ యోజన స్కీం కింద వీటిని పునర్నిర్మిస్తున్నది.
ఆ పిమ్మట భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించినాము. ఈ ఆలయం కాకతీయుల కోట కంటే చాలా పురాతనమైనది. చాళుక్య వంశానికి చెందిన రెండవ పులకేశి వేంగీ రాజ్యం పై సాధించిన విజయానికి గుర్తుగా ఈ భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అక్కడ గల గోడ పై ఉన్న శాసనం ప్రకారం సా.శ. 625 లో కట్టబడినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత కాకతీయ రాజులు తమ కులదేవత గా అమ్మవారిని స్వీకరించినారు. మాలిక్ కాఫర్ దండయాత్ర లో ఈ ఆలయానికి చెందిన అతి విలువైన వజ్రాల్ని కొల్లగొట్టినారు. దసరా పర్వదిన సందర్భం లో ఈ ఆలయం లో ఉత్సవాలు ఘనం గా జరుగుతాయి.
సా.శ. 1950 లో గణేశ్ రావు శాస్త్రి, మగన్ లాల్ అనే భక్తుల సంకల్పంతో ఎన్నాళ్ళో మూతబడిన ఈ ఆలయాన్ని తెరిచి ప్రస్తుతం పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం ఒక పెద్ద గుట్ట పై నిర్మించడం వల్ల భక్తులు ఎంతో ఆహ్లాదాన్ని , భక్తి భావాన్ని అనుభూతి చెందుతారు. ప్రాచీన శాసనాలు ఇక్కడి గోడలపై అనేకం కలవు.వాటిని చదివినట్లయితే మనకి ఆ నాటి విశేషాలు ఎన్నో తెలుస్తాయి. ఆ తర్వాత ఎంతో ఘనత వహించిన వెయ్యిస్థంభాల గుడికి వెళ్ళాము.
వెయ్యి స్థంభాల గుడి దేశ విదేశాల్లో ఎంతో పేరెన్నిక గల గొప్ప నిర్మాణం. 12 వ శతాబ్దం లో కాకతీయ ప్రభువు రుద్ర దేవుడు దీని నిర్మించాడు. శివుడు,విష్ణువు,సూర్యుడు ఈ ముగ్గురు అధి దేవతలకు మూడు ఆలయాల్ని దీని లోపల నిర్మించారు.వీటన్నిటినీ కలిపి త్రికూటాలయం అంటారు. ఇక్కడి ఆలయం లో గల స్థంభాలపై ఎన్నో అందమైన శిల్పాల్ని చెక్కినారు. అతి పెద్ద రాతి తో చెక్కిన నంది విగ్రహం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతగాక ఆలయం లో చెక్కిన ఏనుగుల శిల్పాలు మనోహరం గా ఉన్నాయి.
ఏకరాతి లో అనేక శిల్పాలు చెక్కిన వైనం అద్భుతం గా ఉన్నది. రాతిని అత్యంత నునుపు గా చేసి తీర్చి దిద్దటం ఆనాటి శిల్ప నైపుణ్యానికి అద్దం పడుతుంది. వెయ్యి స్థంభాల గుడి లాంటి నిర్మాణం ఇంకా ఎక్కడా లేదని గర్వంగా చెప్పవచ్చును. తుఘ్లక్ జరిపిన దక్కన్ దండయాత్ర లో ఈ ఆలయం దెబ్బతిన్నది. భారత ప్రభుత్వం ఇంకా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీటి పునరుద్ధరణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఈ విధముగా ఎంతో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు అన్నిటిని సందర్శించి ఎంతో విజ్ఞానాన్ని పొందినాము.
గతకాలపు వైభవాన్ని , వారసత్వ కట్టడాల్ని మనం పరి రక్షించుకోవాలి అనే ఆలోచన ఈ వైజ్ఞానిక యాత్ర ద్వారా మాకు కలిగింది. అదే రోజు సాయంత్రం మళ్ళీ మా టూరిస్ట్ బస్సుల్లో అందరము ఎక్కి క్షేమంగా భద్రాచలం లోని మా పాఠశాల ఎస్.ఎన్.ఎం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు దిగినాము. అక్కడి నుంచి మా ఇళ్ళకి చేరుకున్నాము. ఇంత మంచి యాత్ర ని మాకు ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
ఇట్లు
స్టూడెంట్స్ డాక్యుమెంటేషన్ కమిటీ
ఎస్.ఎన్.ఎం.జడ్.పి. ఉన్నత పాఠశాల,కొర్రాజుల గుట్ట
భద్రాచలం
No comments:
Post a Comment
Thanks for your visit and comment.