సిల్క్ రూట్ లో సాహస యాత్ర పుస్తకం చదవడాన్ని ఈ మధ్యనే ముగించాను.ఒకానొక సమయంలో ఉత్కంఠ భరితమైన నవలల్ని ఏకబిగిన ఎలా చదివేసేవాడినో అలాగే ఇది కూడా చదివాను.మరి సస్పెన్స్ ఏముంది అనవచ్చు.అలాంటిదే ఉన్నది.పరవస్తు లోకేశ్వర్ గారి శైలి పంటికింద రాయిలా కాక పక్కనే ఒక మనిషి మాటాడుతున్నట్లుగా ఉన్నది.
పావ్లో కొయ్లో ఒకసారి అంటాడు 'ప్రయాణాలు చేయడానికి ముందు కావలసింది ధైర్యం...ఆ తరవాత ధనం' అని!ఉజ్బెకిస్థాన్,కిర్గిస్థాన్,చైనాల గురించి మనకి తెలిసింది చాలాతక్కువ.అంతకంటే ఎంతో దూరం లో ఉన్న యూరోపిఎన్ దేశాల గురించి,అమెరికా గురించి మనకి బాగా తెలుసు.మన పిల్లల,బంధుమితృల ఉద్యోగ సద్యోగాల రీత్య..చదువుల సాగింపు వల్ల..!
కాని జ్ఞానతృష్ణ చేత ఆయా దేశాల ని తిరిగి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఒంటరిగా ప్రయాణించడం అనేది ఒక దుస్సాహసమే..!ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి గుంపులుగా ప్రయాణించడమంటే మక్కువ ఎక్కువ.దాంట్లో రిస్క్ తక్కువ.ఆడుతూ పాడుతూ కాలక్షేపమూ జరుగుతుంది.
అంతర్జాలం సహాయం తో మనం అన్ని దేశాల వివరాలు బాగానే తెలుసుకోవచ్చు.కాని రక్త మాంసాలతో కూడిన అనుభూతులు..ఆస్వాదన...జ్ఞానార్జన స్వయంగా తిరిగినప్పుడే వస్తుంది.తాష్కెంట్,బుఖారా,సమర్ఖండ్ లలోని ప్రదేశాలలోకి..మొగలుల ఆత్మ ఉన్న చోటికి ..మనల్ని అలా నడిపించుకువెళ్ళారు పరవస్తు లోకేశ్వర్.ఎన్ని విశేషాలు..అది చదవడం లోనే కలదు మజా..!
కొన్ని ఫోటోలు కూడా ఇచ్చారు.వారి శిల్ప కళలోని వైవిధ్యం అర్ధం అవుతుంది.ఆ పురాతన కట్టడాలని చూస్తుంటే ఏ ఉత్తరాది నగరం లోనో ఉన్నట్లుగా ఉంటుంది.మరి మూలాలు మధ్య ఆసియా నుంచేగదా..!
కిర్గిస్తాన్ లో మెడిసిన్ చదువుతున్న తెలుగు ఇంకా ఇతర రాష్ట్రాల పిల్లల యొక్క గాధలు కొత్తకిటికీలు తెరుస్తాయి.ప్రిస్టేజ్ కోసమో,ధన సంపాదన కోసమో మెడిసిన్ చదివే సంస్కృతి మనకి దాపురించడంవల్ల నిజం గా వైద్య శాస్త్రం పై ఆసక్తి గల విధ్యార్దులకి మెడిసిన్ సీటు అందని మానిపండే అయింది.మళ్ళీ ఆయా విషయాల్లో రిసర్చ్ ఏమైనా జరుగుతుందా అంటే ఏమీఉండదు..దానికి విదేశాలపై ఆధార పడాలిసిందే..!
కిర్గిస్థాన్ లో ప్రజలు రౌడీల కంటే ఎవరికి,ఎందుకు భయపడతారో రాసిన విధానం బాగున్నది.చిన్న చిన్న దేశాల్లో సైతం మల మూత్రాదులు విసర్జించడంలో తీసుకునే శుబ్రతా చర్యలు ఎంతో సాంస్కృతిక ఔన్నత్యం గల మన దేశం లో తీసుకోకపోవడం బాధగా అనిపిస్తుంది.రచయితకి ఆయా దేశాల్లో పరిచయమయ్యే మితృలు ..వారు చేసే సాయాలు చూసినప్పుడు ప్రతి చోట తోటి మనిషిని అర్ధం చేసుకునేవారుంటారనిపిస్తుంది.చైనా లో భాషా సమస్య..ఆహార విహారాలు...దైనందిన అనుభవాలు కధ వెనుక కధలు ఆసక్తిగా వున్నాయి.
అలనాడు హుయాంత్సాంగ్..ఫాహియాన్..మార్కోపోలో లాంటి యాత్రికులు ఇంకా ఎలాంటి దుర్భర పరిస్థితులని ఎదుర్కొని ప్రయాణాలు చేశారో కదా అనిపించక మానదు.తిరగడం లోనే మానవ స్వభావం లోని లోతుపాతులు తెలుస్తాయి.తిరగడం అనేది ఒక పోరాట స్వభావం లాంటిది.ప్రతి జాతి లోను కొన్ని బలాలు,బలహీనతలు ,వైరుధ్యాలు ఉంటాయి.అవి అర్ధం చేసుకున్నప్పుడు ఎవరిని ఏ విధంగా ఆకట్టుకోవాలో..వారించాలో చక్కగా అవగతమౌతుంది.అందుకేనేమో యూరోపిఎన్ లు పిచ్చిగా తిరుగుతుంటారు ప్రపంచమంతా...!
-- By KVVS Murthy
For copies,contact: Paravastu Lokeswar (Writer), Mobile no: 9160680847
పరిచయం చాలా బాగా రాశారు మూర్తిగారు. విజిటింగ్ ప్లేసెస్ గురించి పరిశీలన కూడా చక్కగా ఉంది.
ReplyDeleteధన్యవాదాలు వర్మ గారు..! మీ ప్రశంస తో మరిన్ని పుస్తక పరిచయాలు రాయాలనిపిస్తున్నది..!
DeleteNice sir
ReplyDeleteThanks for your compliments sir..!
Delete