Sunday, September 29, 2013

ఒడిస్సా పర్యటన (Part-5)

భువనేశ్వర్ కి కొద్ది దూరం లో నున్న ధౌలి అనే ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ బౌద్ధ శాసనాలు తవ్వకాల్లో దొరికాయి.బుద్దుని గురించిన విశేషాలని అక్కడ నిర్మించిన పగోడా పై చక్కగా శిల్పించారు.తెల్లగా..చాలా ఎత్తులో ఉన్నది.దీని కింద భాగం లో దయా నది ఉంటుంది.అక్కడే కళింగ యుద్ధం జరిగినట్లు చరిత్ర చెబుతున్నది.రక్తం వరదలై ప్రవహించిన ప్రాంతం గా చెప్పాలి. ఆ తరవాత అశోకుని లో మార్పు వచ్చి బౌద్ధ మతాన్ని స్వీకరించడం మనం చదువుకున్నదే కదా..!



మిట్ట మధ్యహ్నాం రెండు గంటలయిందా..పైకి ఎక్కడానికి కాళ్ళు సర్రుమంటున్నాయి.ఆ పగోడ కి చుట్టూరా బుద్ధుని కధలని తెలిపే చిత్రాలు ఉన్నాయి.దీన్ని జపాన్ బౌద్ధ సంఘం వారు, ఇక్కడి స్థానిక సంస్థలతో కలిసి నిర్మించారు.ఇది ఒక గుట్ట మీద ఉన్నది.కూర్చోవడానికి కొన్ని సిమెంట్ బెంచీలు కూడా ఉన్నాయి.జనాలు పలచగా ఉన్నారు...ఒక అయిదుగురు ..తెలుగులో మాట్లాడుకుంటు కనిపించారు.



దీని వెనుకనే ఒక శివాలయం ఉన్నది...ఇక్కడ ఈ భువనేశ్వర్ లో  శివాలయాలు విపరీతం గా ఉంటాయి.అది మరీ పురాతనమైనది కాదు.

కాని లింగరాజ్ ఆలయాన్ని భువనేశ్వర్ లో తప్పక దర్శించవలసిన ప్రాంతం గా చెప్పాలి. మనకి భక్తి ఉందో ..లేదో తరవాత విషయం... కాని ఆ నిర్మాణం యొక్క గొప్పదనానికి జోహార్లు అర్పించవలసిందే,ఒడిషా ఆలయ శిల్పులు దేశం లోని ఏ ఇతర ప్రసిద్ద దేవాలయ నిర్మాణాల్ని కాపీ కొట్టకుండ తమకంటూ ఒక ప్రత్యేక నిర్మాణ శైలిని ఏర్పరుచుకున్నారు.దానికి గాను అభినందనలు తెలుపవలసిందే...లింగరాజ్ ఆలయం యొక్క ప్రధాన గోపుర శిఖరం గుండ్రంగా..వాటి మీద శిల్ప సంపదతో ...ఆకాశాన్ని ముద్దుపెట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. ఆ ఆలయ ప్రాంగణం లో చిన్న గుళ్ళు మొత్తం కలిపి ఓ వంద పైనే ఉంటాయి.ఆ విధంగా నేను ఎక్కడా చూడలేదు.చాలామటుకు శిధిలమవుతున్నాయి.మళ్ళీ 11 వ శతాబ్దం లోకి వెళ్ళినట్టనిపించింది లోపల తిరుగుతుంటే..!

No comments:

Post a Comment

Thanks for your visit and comment.