Tuesday, October 1, 2013

రహస్య భారతం లో నా ఆధ్యాత్మిక అన్వేషణ పుస్తకం పై నా రివ్యూ..!


రహస్య భారతం లో నా ఆధ్యాత్మిక అన్వేషణ పుస్తకం పై నా రివ్యూ..!




పాల్ బ్రంటన్ అనేపేరు తెలుగు పాఠకులకుసుపరిచితమే!1934 లో ఆయన వెలువరించిన A Search in secret India అనే గ్రంధానికి అనువాదమే ఇది.పాల్ బ్రంటన్ అసలు పేరు Raphel Harst .చాలా వరకు రచనలన్నీ ఆయన వివిధ కలం పేర్లతోనే రాశారు.శోధించి తెలుసుకోవడం ,మానవ ప్రయత్నానికి అగ్రస్థానం ఇవ్వడం యూరోపిఎన్లకు బాగా ఇష్టమైన పనులు అని చెప్పాలి.తదేకంగా ఒకేపనిమీద కొన్ని రోజులు,అవసరమైతే కొన్ని ఏళ్ళు కూర్చోవడానికి కూడా వెనుదీయని ఈ పాశ్చాత్యుల ధీర గుణం వల్లనే మనకి అనేక దేశాలకి సంబంధించిన అనేక శాస్త్రాలు అందుబాటులోకి వచ్చినవి.

భారతీయ జీవనంలో యోగులకి గల స్థానం పరమ పూజనీయమైనది.చివరకి చిన్నపాటి ఇంద్రజాలం చేసి అలరించి ఆకట్టుకునే మాయ యోగులకి కూడా మన సమాజం ఎంతో కొంత విలువనిస్తుంది.భౌతిక శాస్త్ర ప్రమాణాలరీత్యా నిజమైన యోగిని కనుగొనడం అసాధ్యం.దీని మాటున నకిలీలు కూడా అలా చెల్లుబాటు అయిపోతుంటారు.

మరి ఇలాంటి విషయంలో పరిశోధనకు గాను ఒక బ్రిటీష్ రచయిత పాల్ బ్రంటన్ ఇక్కడికి కొన్ని దశాబ్దాల క్రితమే విచ్చేసి తన అన్వేషణ సాగించడం అద్భుత విషయమే.ఉత్తర భారతం లో ఆయన కలిసిన మెహెర్ బాబా,ఈజిప్ట్ కి చెందిన ఇంద్రజాలికుడు ఆయనలో ఒక ఆసక్తిని కలిగిస్తారు.బాహ్య ఆడంబరాలకి,పూజలకి,తంతులకి ప్రాధాన్యమిచ్చే వారిని ఆయన కలుసుకోవడానికి పెద్దగా ఇష్టపడలేదు.

అంతర్ముఖీన యోగశక్తి పనిచేయడం కాదు..అది బాహ్యప్రపంచానికి సంబంధించి ఏవైనా ప్రభావం చూపగలుగుతుందా..ఒక వేళ సాధ్యమైతే అవి ఎలాంటివి అంటూ ఒక నిర్ణీత పద్ధతిలో తన పరిశోధనని కొనసాగించారు.కేవలం తనని మొత్తం అర్పించుకోవడానికి ఆయన ఇక్కడికి రాలేదు అని మనం గ్రహించాలి.ఒక సన్నని దారం అంత ఎడం ని బ్రంటన్ పాటించారు.పాశ్చ్యాత్యులకి సహజమైన భౌతిక సాక్ష్యం ఉంటే తప్ప నమ్మననే తత్వాన్ని మూలాధారంగా చేసుకుంటూ తన పని చేసుకుపోయారు.

తమిళనాడు లోని బ్రమ అనే యోగి వద్ద హఠ యోగం మానసిక తలాలపై కూడా ఎలా పనిచేస్తుందో బ్రంటన్ అవగాహన చేసుకున్నారు.పరిణితి సాధించిన యోగి లో గల శక్తులను తులనాత్మకంగా అంచనా వేశారు.

అనువాదకులు జొన్నలగడ్డ పతంజలి అనువాద శైలి రమ్యంగా,చదువరిని ఇబ్బంది పెట్టని రీతిలో సాగింది.ఇటువంటి వస్తువు తో కూడిన గ్రంధాన్ని తెలుగు చేయడం అంత సులువు కాదు.

రాధాస్వామి అనుయాయుల భౌతిక దృక్పధం,దానితో పాటు వారి ధ్యాన పద్ధతులు బ్రంటన్ ని అలరించినవి.రామకృష్ణ పరమహంస యొక్క ప్రత్యక్ష శిష్యులు మాస్టర్ మహాశయులను ఆయన కలిశారు.రమణ మహర్షి ని అందరిలోకి ప్రత్యేకమైన యోగిగా భావించి వారి ఆశ్రమం లోనే కొన్ని రోజులు ఉన్నారు.ఆయన భోదన మౌనంగా ఉన్న సమయం లోనే ఉంటుందని ...కొన్ని విషయాలు మాట్లాడటం వల్ల అర్ధం అవ్వవని బ్రంటన్ భావిస్తారు.ఆశ్రమం లో తెలుగు వారైన రామయ్య యోగి శక్తి ని ఉగ్గడిస్తారు.

పాల్ బ్రంటన్ వ్యక్తీకరించే విధానం అది ఏ విషయమైనా గాని పూర్తిగా ఎటువైపు మొగ్గకుండా సునిశిత పరిశీలనని నింపుకొని ఉంటుంది.అది ఒక శోభని కలిగి పఠితని తనని తాను ఆలోచించుకోమంటుంది.పాశ్చ్యాత్యులు ఏ పనిని ఊరికే చేయరు.నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే వుండాలి.దాని నుంచి తమ భౌతిక ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే యోచన చేస్తారు.  

 పాల్ బ్రంటన్ ఈ గ్రంధానికి పెట్టిన పేరు A search in secret India .కాని తెలుగు అనువాదంలో "ఆధ్యాత్మిక" అనే పదాన్ని కూడా అదనంగా కొంత స్వేచ్ఛ తీసుకొని చేర్చినట్లున్నది.బ్రంటన్ యోగులను మీరు అని సంభోధించినట్లుగా,యోగులు బ్రంటన్ ని నీవు అని సంభోధినించినట్లుగా సంభాషణలు సాగుతాయి.నిజానికి పాల్ భారతీయ శిష్యుల మాదిరిగా స్వేచ్ఛని కోల్పోయే విధేయతని ప్రకటించినట్లుగా పుస్తకం లో మనకి కనబడదు.

Western tone లో నుంచి వచ్చే  కొన్ని కొన్ని మాటల్ని అర్ధం చేసుకోవడం లో మనకి కొత తర్ఫీదు అవసరం.ఒక్కోసారి వారి వ్యంగ్యాన్ని కూడా పొగడ్త గా స్వీకరిస్తుంటాము.కొన్ని pre- conceived thoughts ని లోపల పెట్టుకొని ఏ వైపు తన conclusion ని ఇచ్చినట్టు కనబడదు.తారసపడిన సంఘటనలని ఒక ఆసక్తి కరమైన డాక్యుమెంట్ లా రికార్డ్ చేశాడాయన.Click here

                                                       --By KVVS Murthy

5 comments:

Thanks for your visit and comment.