Sunday, October 19, 2014

భీంసేన్ జోషి గారి తో ఒక రోజు...!



నా కిప్పటికి అనిపిస్తుంది నేను భీం సేన్ జోషీ గారి ని కలిసానా ..లేకా కలా అని..!కాని నిజమే ఎందుకంటే నాతో పాటు వచ్చిన ఇంకొక మిత్రుడు కూడా అప్పుడప్పుడూ గుర్తు చేస్తుంటాడు కాబట్టి..! అతనిప్పుడు జహీరా బాద్ అనే ఊరిలో కాలేజీ కూడా నడిపే మా మిత్రుడు ప్రతాప్ కుమార్ కాబట్టి.బహుశా అది 1991 వ సంవత్సరం..నాకు డైరీ రాసే అలవాటు లేదు..ఇంకా అప్పట్లో ఈ ఫేస్ బుక్ లేదా బ్లాగు ల్లాంటివి నాకు పరిచయం కాలేదు ..!పూణే లో మా మిత్రుడు నేను కలిసి భీం సేన్ జోషి గారి ఇంటికి వెళ్ళాము.ఆయన అప్పటికే విఖ్యాతి చెందిన హిందూస్థానీ గాత్రకారుడు అనే విషయం సూచాయగా తెలుసు. కాని ఆయన సవాయ్ గాంధ్ర్వ బాణీ కి వన్నె తెచ్చిన మహా విధ్వాన్సుడని,ఇందిరా గాంధి లాంటి వారికి సైతం ఎంతో ఇష్టుడైన గాయకుడని తర్వాత తెలిసింది.ఒక్కోసారి ఒకరి గొప్పతనం తెలియకుండా కలవడం లోని కిక్కేమిటో భీం సేన్ జోషి గారిని కలిసిన తరవాతనే తెలిసింది.మహా విద్వాన్సులు ఎవరైనా చంటిపిల్లల లాంటి వారే.. అది ఇప్పుడు గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది.పూనే లో వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని కూర్చొబెట్టి చాలా సేపు కూర్చొబెట్టి మాట్లాడారు.ఎందుకో తెలియదు కాని చిన్న నాటి నేస్తం తో మాట్లాడినట్లు అనిపించింది.జి.కె.వెంకటేష్,మంగళంపల్లి గురించి కూడా చెబుతూ వాళ్ళు తనకు సహాధ్యాయులని చెప్పుకొచ్చారు.లతా మంగేష్కర్ తో పాడిన ఓ కేసెట్ ని కూడా ఆయన మాకు బహూకరించారు.మా మిత్రుడు ప్రతాప్ ఆ సందర్భంగా ఓ ఫోటో తీశారు.అది ఎందుకనో పెద్ద క్లారిటీ గా రాలేదు.పైన చూస్తున్నారుగా..అదే..!చాన్నాళ్ళతర్వాత ఆయన గురించి తెలుసుకొని ఇంత గొప్ప వ్యక్తినా నేను కలిసింది అనిపించింది.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.