Wednesday, October 29, 2014

అనేకమంది లబ్ద ప్రతిష్టులైన జర్నలిష్టులతో కలసి పని చేసే అదృష్టం ఆ విధంగా కలిగింది.




తాత్కాలికంగా కొన్ని పనులు చేస్తాము.మళ్ళీ ఎందుకనో వేరే కారణాలచేత వాటిని వదిలి వేస్తాము.అవి మంచివా..చెడ్డవా అటుంచండి..మనదగ్గరకి వచ్చే ప్రతిదీ ఏదో ఒకటి మనకి నేర్పడానికేనేమో..!కొన్నాళ్ళు పోయిన తర్వాత చూసుకుంటే ఆ అనుభవాలు నేర్పే గుణపాఠాలు ఇవా..ఇందుకేనా అనిపిస్తుంది.

1989 లో అనుకుంటాను ..ఒక మిత్రుని కోరికపై ఉదయం దినపత్రిక లో విలేకరి గా చేరాను.నిజంగా ఆ మత్తుకి అలవాటు పడినవారు అంత తొందరగా బయటకి రాలేరు.నా అనుభవమైతే అది.ఎంత కొమ్ములు తిరిగినవాడు మన ముందు అధిక ప్రసంగం చేయడానికి భయపడతాడు.అయితే నిజాయితీ గా ఉండి దానిలో సంపాదించడం చాలా కష్టసాధ్యమైన విషయం.ఏదో ఇతర వృత్తి,వ్యాపారం ఉంటే తప్ప ఆర్ధికంగా ప్రయోజనం ఉండదు.అయితే న్యూస్ సేకరించడం,మళ్ళీ దాన్ని చక్కగా రాసుకొని డెస్క్ కి పంపడం,మళ్ళీ మనం రాసింది అచ్చు లో చూసుకోవడం భలే గమ్మత్తు గా ఉండేది.విలేకరి కి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉంటారు తప్ప ఫ్రెండ్స్ తక్కువ గా ఉంటారు.అదంతే.పోలీస్ అధికారులు,రాజకీయ నాయకులు,ఇతర ప్రముఖులు బాగా పరిచయమవుతారు.వాళ్ళే మనకి న్యూస్ ఎక్కువగా ఇస్తుంటారు.ఆ తర్వాత మరో రెండు ప్రముఖ దిన పత్రికల్లో విలేకరి గా చేశాను.రాష్ట్రం లోను.. ఇతర రాష్ట్రాలలోను..అనేకమంది లబ్ద ప్రతిష్టులైన జర్నలిష్టులతో కలసి పని చేసే అదృష్టం ఆ విధంగా కలిగింది.

రాసే చెయ్యి ఊరుకోదని...ఆ తర్వాత కూడా చిన్న చితకా వాటికి న్యూస్ పంపేవాడిని.ఇంగ్లీష్ వాటిల్లో కూడా ట్రై చేద్దామని కొన్ని న్యూస్ వెబ్సైట్ లలో కూడా రాశాను.పరోక్షంగా ఇవన్నీ కూడా నాకు ఈ గాడ్ ఫాదర్ అనువాదం లో సహకరించే విషయాలుగా మారాయి.ఓపిగ్గా రాయడం అనే గుణాన్ని ఇవి నాలో ప్రోది చేశాయి.అట్లా జర్నలిజం నాలోని ఒక పార్శ్వాన్ని ఎన్రిచ్ చేసింది. కొన్ని అపురూప అనుభావాలు పంచి ఇచ్చింది.రాండల్ఫ్ ఎరిక్సన్ అనే బ్రిటిష్ జర్నలిస్ట్ తో జరిగిన పరిచయం ..నేను ఇంగ్లీష్ బ్లాగింగ్ లోకి వెళ్ళడానికి దారితీసింది.ఆయన గార్డియన్ ,జేన్స్ డిఫెన్స్ వీక్లీ కి ఫ్రీలాన్స్ గా రాస్తుంటారు.బహుశా నాలుగేళ్ళ క్రితం అనుకుంటా ..మా యింటికి వచ్చారు.అవి ఎప్పుడైనా చెప్పుకుందాము. 

No comments:

Post a Comment

Thanks for your visit and comment.