Monday, March 3, 2014

నా ఫతేపూర్ సిక్రి పర్యటన



ఫతేపూర్ సిక్రీ వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకొంటున్నప్పటికీ ఈ మధ్యనే సాధ్యపడింది.మొగలు ప్రభువులు మనదేశానికి ఇచ్చిన కోటలు,బ్రహ్మాండమైన భవనాలు,ఇంకా ఇతర కట్టడాలు వెలకట్టలేనివి.అవి వారి కళా తృష్ణకి ,వైభవానికి మచ్చుతునకలు.ఇప్పటికీ అవి పర్యాటక ప్రదేశాలుగా ఎంతో ధనాన్ని ఆర్జించిపెడుతున్నాయి.ఆగ్రా కి రమారమి 27 కి.మి. దూరం లో ఈ ఫతేపూర్ సిక్రి ఉన్నది.అక్బర్ దీన్ని మొదట రాజధానిగా చేసుకోవాలని నిర్మించాడు.అయితే దాపులోనే ఉన్న రాజపుత్రుల తాకిడి,నీళ్ళ కరువు లాంటివి అక్కడ ఎక్కువ కాలం ఉంచలేకపోయాయి.ఆ తరువాత లాహోర్ కి రాజధాని ని మార్చడం జరిగిని.క్రీ.శ.1571 నుంచి 1585 దాకా మాత్రమే అక్బర్ ఇక్కడ ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది.



ఈ సిక్రి కి ముందు తగిలే ఒక హోటల్ లో రెండు రొట్టెలు తిని బయలుదేరాను.రొట్టెలకి 20 రూపాయలు తీసుకోగా దానిలోకి ఇచ్చిన కూరకి మాత్రం 50 రూపాయలు తీసుకున్నాడు ఆ హోటల్ యజమాని. ఆగ్రాకి ఈ సిక్రి కోటకి దూరం బాగానే ఉన్నది.ఆగ్రా లో రోడ్డు మీద ఎవరిష్టం వాళ్ళదే అన్నట్లున్నది ఆ ట్రాఫిక్ చూస్తుంటే.ఎడమ లేదు..కుడి లేదు ఎవరెటు వస్తారో తెలీదు.



సరే..సిక్రి కోటకి వచ్చాము.బయటనుంచే కోటకి సంబందించిన గోడలు అవీ శిధిలమైనవి కనబడుతున్నాయి.దాదాపు 5 మైళ్ళ విస్తీర్ణం లో చుట్టూతా గోడ ఉన్నది.ఎంట్రెన్స్ దగ్గరకి రాగానే మహా రాక్షసుని లా కనబడే గుంబాజ్ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది.వళ్ళు ఝల్లుమంటుంది ఆ మహా ఆకారాం చూసి.లోపలకి అడిగుపెడితే ఒక ప్రపంచం లాగానే ఉంటుంది.ఎన్ని గదులు,ఎన్ని నిర్మాణాలు ,ఎన్ని రకాల భవనాలు లెక్కే లేదు.ఎర్రటి రాయి ఎక్కువ ఉపయోగించారు.హిందు,ముస్లిం నిర్మాణశైలులు కలగలసిఉన్నాయి.



అక్బర్ తాను ఎంతో గౌరవించే సూఫి గురువు షేక్ సలీం చిస్తి కి దీనిలో ఒక చలువరాతి భవనాన్ని నిర్మించాడు.దానిలో ఆయన సమాధి ఉన్నది.ఆ భవనం గోడలకి మార్బుల్స్ తో చేసిన రకరకాల డిజైన్ లు చాలా బాగున్నాయి.ఒకదానిలా ఇంకొకటి ఉండదు.



ఇంకా కోటలోని అంతర్నిర్మాణాలు  దేనికదే అద్భుతం.బయట పర్యాటకులకోసం అనేక రకాల వస్తువులు అమ్ముతున్నారు.అయితే ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే మనం లోపల కెళ్ళి చూస్తున్నప్పుడు కూడా లిటరేచర్ ఇంకా ఇతరవస్తువులు అమ్మేవాళ్ళు మనకి ఊపిరి సలపకుండా ఊదరగొడుతుంటారు.దాంట్లో మళ్ళీ అంతా పిల్లలే ఎక్కువ.Click Here

No comments:

Post a Comment

Thanks for your visit and comment.